Udipi Temple Information

 ఉడిపి - కర్ణాటక | Udipi  Temple Information

శ్రీ మోహన్ గార్కి కృతజ్ఞతలు తెలియచేస్తూ .. ఆయన రాసిన పోస్ట్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను ..


ఇక మేము కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రం నుండీ బయలు దేరి, ఉడిపి క్షేత్రం చేరుకున్నాము. కుక్కే నుంచి ఉడిపి మంగుళూరు మీదుగా వెళ్ళాలి. చాలా అద్భుతమైన ప్రయాణం. 

ఉడిపి క్షేత్రం ద్వైత సాంప్రదాయానికి చెందినది. శ్రీ మధ్వాచార్యుల వారు ఇక్కడి ఎనిమిది పీఠాలను స్థాపించారు. అయితే వీటి గురించి మాకు మరీ ఎక్కువగా తెలియదు. మేము అక్కడ ఒక్క రోజు నిద్ర చేసి, ముందు రోజు సాయంకాలం హారతి, దర్శనం పొంది, మరునాడు ఉదయం ప్రాతఃకాల నిర్మాల్య పూజ, హారతి చూడగలిగాము ఆ స్వామి కృపా కటాక్షముల వలన. 
ఇక ఈ ఉడిపి క్షేత్రంలో ఉన్న శ్రీకృష్ణుని గురించి చెప్పుకోవాలంటే, నాకు పెద్దగా తెలియదు.


 శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కారుణ్యం వలన, ఆ క్షేత్రంలో మేము చూసిన అనుభవం మాత్రం నా మాటలలో చెప్తాను. ఇక మిగతా క్షేత్ర వైభవం వగైరా సమాచారం అంతర్జాలంలో ఉన్న తెలుగు వెబ్ సైట్లలోంచి సేకరించినది ఈ క్రింద వ్రాస్తున్నాను.మాకు జరిగిన కృష్ణ దర్శనం:
మేము మొదటి రోజు సాయంత్రం వెళ్ళాము దర్శనానికి. అక్కడ స్వామి వారిని మనం ప్రత్యక్షంగా చూడడానికి ఉండదు. గర్భగుడిలో ఉన్న కృష్ణ మూర్తిని తొమ్మిది రంధ్రాలు ఉన్న కిటికీ ద్వారా మాత్రమే చూడగలము. మేము వెళ్ళిన కాస్సేపటికి సుమారు ఏడు గంటలకి, స్వామి వారికి సాయం హారతి సమయం అయ్యింది. అక్కడ ఒకేసారి కొన్ని వండల నూనె దీపాలు వెలిగించి అత్యద్భుతంగా జరిగింది ఆ హారతి. ఆ మరునాడు ఉదయమే ఐదు గంటలకల్లా మళ్ళీ గర్భ గుడి దగ్గరగా వెళ్ళాము. ప్రతీ రోజూ ప్రాతఃకాల్ంలో నిర్మాల్య పూజ చేస్తారు. అప్పుడు స్వామి వారు ఏ అలంకారములూ లేకుండా దర్శనమిస్తారు. దీనిని ఇక్కడ విశ్వరూప దర్శనం అని చెప్పారు. ఆ విశ్వరూప దర్శనం ఇస్తున్న కృష్ణ మూర్తిని చూస్తే, మన పూజ్య గురువు గారు చెప్పిన దశమ స్కంధంలో యశోదమ్మను, గోపికలను అలరించిన అలనాటి చిన్ని కృష్ణుడే కదా ఈయన అని ఒక్కసారి ఒళ్ళు పులరించింది. అలా బోసిగా దర్శనమిచ్చిన మా చిన్ని కిట్టయ్యకి, పూజ, వెనువెంటనే అభిషేకం చేశారు. అద్భుతము ఆ అనుభవం, అక్కడ ఉన్న అర్చకస్వాములు కూడా చాలా సహాయపడ్డారు, మాకు దర్శనం చేయించడానికి. గర్భగుడిలోకి చూసే ఆ నవగ్రహ ద్వారం చాలా చిన్నది కావడం మూలాన, ఒక్కరే ఆ సేవ అంతా నిరాటంకముగా చూడనివ్వరు. కానీ, ఒకసారి చూసిన తర్వాత, ఇంతలో మిగతా వాళ్ళు కూడా ఒక్కోసారి చూసేసిన తర్వాత, మళ్ళీ మనం వెళ్ళి లైన్ లో నిలబడ వచ్చు. ఇది స్వయంగా అక్కడి అర్చక స్వాములే అనుమతించారు. అలా మేము ఎన్నో సార్లు మళ్ళీ లైన్ లోకి వెళ్ళను, మా బోసి, ముద్దుల బుజ్జి కృష్ణుడిని చూడను. ఆయన చేతిలో ఒక పెద్ద కవ్వం పట్టుకుని నుంచున్నాడు. ఒక చేతిలో వేణువు.
అలా అభిషేకం జరిగిన తర్వాత, స్వామి వారి ప్రక్కనే ఒక అక్షయ పాత్ర కూడా పెడతారు. ఆ అక్షయ పాత్ర కనీసం ఐదు వందల ఏళ్ళ పూర్వం నాటిదిట. అందులో ఏ కోరిక కావాలన్నా కటాక్షిస్తుంది ఆ అక్షయ పాత్ర అని చెప్పారు. ఆ అక్షయ పాత్ర కేవలం మూడు నిమిషాలు స్వామి వారి సన్నిధిలో ఉంచుతారు ఆ సమయంలో. మళ్ళీ తర్వాత లోపల పెట్టేస్తారు.

స్వామి వారి గర్భ గుడికి ఎదురుగా, ఒక వైపు స్వామి హనుమ, ఒకవైపు గరుత్మంతుని సన్నిధులు కొలువై ఉంటాయి. శ్రీకృష్ణ మందిరము వెనుకగా ఒక చంద్రమౌళీశ్వర దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో ఉన్న చంద్రమౌళీశ్వర స్వామి వారు అతి పురాతనమైనవారు. ఆయన ఇక్కడ కృష్ణ మూర్తి రావడానికి పూర్వం ఎప్పటి నుంచి ఉన్నారో తెలియదు...అంత పురాతనముట. అందుకే శ్రీకృష్ణ మఠంలో ఏ ఉత్సవం చేసినా, మొదట చంద్రమౌళీశ్వరుడికి విన్నవించి అప్పుడు మొదలు పెడతారు. అలాగే శ్రీకృష్ణ మందిర ప్రాంగణములోనే ఒక చక్కని సుబ్రహ్మణ్య స్వామి వారి మందిరం ఉన్నది. అక్కడ సుబ్రహ్మణ్యుడు ఐదు పడగలతో ఉన్న నాగేంద్రుడిగా దర్శనమిస్తారు, అదే గర్భగుడిలో ఒక పెద్ద పుట్ట కూడా ఉంటుంది. బహుశా కర్ణాటకలో సర్ప రూపంలో(పుట్టలో) ఉన్న సుబ్రహ్మణ్యుడిని ఎక్కువగా ఆరాధిస్తారు అనుకుంటా. కానీ అద్భుతమైన మందిరము. "అహం స్కందః" అన్నారు కదా కృష్ణ పరమాత్మ, ఆ లోపల ఉన్న కృష్ణుడే స్కందుడు, స్కందుడే కృష్ణుడు. అందుకేనేమో, మాకు కృష్ణ మందిరములో ఉన్న స్వామిని చూస్తే, బాలదండాయుధపాణిగా దర్శనం అయ్యింది. అయితే ఆ చేతిలో దండం బదులు కవ్వం పట్టుకున్నాడు స్వామి.


 

క్షేత్ర వైభవం - అంతర్జాలం నుంచి సేకరించిన విషయం"పరమాత్మను నేనే’ అనే కృష్ణ్భగవానుడు భగవద్గీత ద్వారా తన సందేశాన్ని సమాజానికి అందించాడు. ఆ స్వామి అవతరించిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉడిపి. మన దేశంలో ఉన్న శ్రీకృష్ణుని సుప్రసిద్ధ క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రం బృందావనాన్ని తలపిస్తుంది. ద్వైతమత స్థాపకులు శ్రీమద్వాచార్యులు. అవతరించిన స్థలం భాగ్యత క్షేత్రం. దానికి సమీపంలో ఉన్నదే ఉడిపి. వీరికి గల అపూర్వమైన దివ్యమహిమలతో తీవ్రమైన గాలివానకు సముద్రంలో మునిగిపోతున్న ఓడను  రక్షించినప్పుడు ఆ ఓడలో నావికుడు ఒక గోపీచందనం మూటను కానుకగా సమర్పించాడు. ఆ మూటలో గోపీచందనం కణికల మధ్య వీరికొక చిన్న కృష్ణ విగ్రహం లభించింది. ఈ చిన్న విగ్రహాన్ని శ్రీ మధ్వచార్యులవారు సుమారు 800 సం. లకు పూర్వం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించారు. అంత్యకులజుడైన కనకదాసు ఈ కృష్ణ దర్శనం  చేసుకుని తరించాలని ప్రాధేయపడగా, పూజారులు నిరాకరించినప్పుడు, కనకదాసుకి సాక్షత్ ప్రత్యక్ష దర్శనమిచ్చిన శ్రీ కృష్ణ విగ్రహమే ఈ విగ్రహం. పరమ భక్తుడైన కనకదాసుని కరుణించి తూర్పు ముఖంగా ఉన్న కృష్ణుడు పశ్చిమాభిముఖుడై దివ్యదర్శనాన్ని సాక్షాత్కరించాడు. ఆనాడు కనకదాసుకు గవాక్షంగుండా దర్శనమిచ్చిన  కిటికీలో నుంచే భక్తులు ఈనాటికి కృష్ణ దర్శనం చేసుకుంటారు. దీనినే కనకుని కిటికి అంటారు. కనకదాసు కృష్ణుని ప్రార్ధించిన చోట ఒక దివ్య మంటపాన్ని నిర్మించారు. ఇదే  కనకదాసు మంటపం. శ్రీమద్వాచార్యులవారు ఏర్పాటుచేసిన మఠాల నుంచి ఎంపికైన వారే రెండు సంవత్సరాలకొకసారి ఉడిపి శ్రీకృష్ణుని దేవాలయంలో అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. 12వ శతాబ్దంలో శ్రీమద్వాచార్యులవారు ఉడిపి దివ్యక్షేత్రంలో ఎనిమిది మఠాలను ఏర్పాటుచేశారు. ఆ ఎనిమిది మఠాలలో శ్రీకృష్ణమఠం(శ్రీ కృష్ణ ఆలయం) కూడా ఒకటి.
ప్రపంచంలోని అత్యంత సుందరమైన శ్రీకృష్ణ ఆలయాలలో ఉడిపి శ్రీకృష్ణ ఆలయం ఒకటి.ప్రశాంతమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాలు, అణువణువూ కృష్ణ నామస్మరణతో ఉండే ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. ఒకప్పటి శ్రీకృష్ణమఠంగా,ప్రస్తుతం శ్రీకృష్ణ ఆలయంగా పిల్వబడ్తున్న ఈ ఆలయమంతా కేరళ సంప్రదాయ రీతిలో నిర్మించబడి ఉంది. ఈ ఆలయం ముందు ఒక గోపురాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం మహత్తు చాలా గొప్పది. శ్రీమద్వాచార్యులవారు ఇక్కడ శ్రీకృష్ణ్భగవానుడ్ని బాలకృష్ణ రూపంలో ప్రతిష్టించారు. ఆలయం బయట, ప్రధాన గోపురానికి ఎదురుగా కనకదాసు మందిరం ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ కొలువై ఉండడానికి భక్తుడైన కనకదాసే కారణం. నిమ్నజాతికులస్థుడైన కనకదాసు శ్రీకృష్ణ్భగవానుడికి మెచ్చిన శ్రీకృష్ణ్భగవానుడు పడమరాభిముఖంగా దర్శనమిచ్చినట్లు ఇక్కడి స్థల పురాణాచెప్తున్నాయ. ఆ కారణంగానే ఇక్కడ గర్భాలయంలో కొలువైన బాలకృష్ణుడు పడమరాభిముఖంగా దర్శనమిస్తాడు. ప్రధానాలయంలో కుడివైపు భాగంలో శ్రీమద్వతీర్థం ఉంది. అలనాటి దేవాలయ సంస్కృతి, సంప్రదాయాలను స్ఫురణకు తెచ్చే ఈ తీర్థం మధ్యభాగంలో మనోహరమైన మండపమొకటి ఉంది. ఈ మండపంలో శ్రీమద్వాచార్యుల దివ్య ప్రతిమ ఒకటి ఉంది. ఉత్సవాలు, పండుగలపుడు ఈ తీర్థంలోనే స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. తీర్థానికి ఒడ్డున ఒకవైపున భగీరధుని మందిరం ఉంది. ప్రధానాలయంలో ఎడమవైపు భాగాన చెన్నకేశవస్వామి మందిరముంది. ప్రధానాలయమంతా భక్తులను ఓ అద్వితీయమైన అనుభూతికి గురిచేస్తుంది. శ్రీకృష్ణుని లీలావిశేషాలు తెలిపే అందమైన తైలవర్ణ చిత్రాలు, అలనాటి పనితనానికి నిదర్శనంగా కానవచ్చే కొయ్యశిల్పాలు, ఇవన్నీ భక్తులను అనితర సాధ్యమైన లోకాలకు తీసుకుని వెళతాయి. గర్భాలయం ముందు భాగంలో వెండితో చేసిన ధ్వజస్తంభం ఉంది. దానికి సమీపంలోనే తీర్థ మండపం ఉంది. ఈ తీర్థ మండపంలోనే స్వామివారికి ప్రీతిపాత్రమైన అటుకలపొడి తదితరాలను ఉంచుతారు. పూజలు నిర్వహించే సమయంలో ఈ తీర్థ మండపంలో జ్యోతులు వెలిగిస్తారు. ఆ సమయంలో ఈ మండప శోభ వర్ణనాతీతం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భక్తులకు గర్భాలయ దర్శనం ఉండదు. స్వామివారిని కిటికీగుండా మాత్రమే దర్శించుకోవాలి. ఈ కిటికీని నవరంధ్ర కిటికీ అని పిలుస్తారు. ఇక్కడ ఈ దేవాలయ సింహద్వారం తూర్పుముఖంగా ఉన్నప్పటికీ స్వామివారు మాత్రం పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు. గర్భాలయంలో కవ్వము, పిల్లనగ్రోవి చెరియొక చేతధరించిన శ్రీకృష్ణుని విగ్రహం దర్శనమిస్తుంది. ఈ గర్భాలయం ద్వారా బంధం లేని గర్భగుడిగా విరాజిల్లుతోంది. గర్భాలయం బయట శ్రీమద్వాచార్యుల దివ్యమంగళ మూర్తి ఉంది. ఆలయ ప్రాంగణంలోనే మరోపక్క శ్రీమద్వాచార్య పీఠం ఉంది. అలనాటి కట్టడాలను స్ఫురణకు తెచ్చే ఈ మఠ శోభ వర్ణనాతీతం. ఇక్కడే ఆంజనేయస్వామివారి భవ్య మందిరం ఒకటి ఉంది. ఈ మందిరంలో కొలువుదీరిన ఆంజనేయస్వామి వీరాంజనేయస్వామి అవతారంలో కనిపిస్తారు. ఇదే ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కొలువుదీరాడు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని వాదిరాజస్వామి ప్రతిష్టించారు.


ఇక్కడే మరోపక్క నవగ్రహాలయం, గోశాల, గీతామందిరాలున్నాయి. ఓ అపురూపమైన ఆధ్యాత్మికానుభూతిని సొంతం చేసే ఈ ఆలయానికి సమీపంలో పురాతన కాలంనాటి అనంతేశ్వరస్వామి ఆలయం ఉంది. భీముడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ప్రసన్న సోమేశ్వరస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అయ్యస్వామి మందిరాలున్నాయి. ప్రధానాలయానికి మరోపక్క చంద్రవౌళీరస్వామి ఆలయం ఉంది. ఇది కూడా అత్యంత పురాతనమైన మందిరంగా ఖ్యాతికెక్కింది. గర్భాలయంలో కొలువైన చంద్రవౌళీశ్వర స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఇదే ఆలయం చుట్టూ మదిరాజమఠం, పుత్తెగ మఠం, అధమూరు మఠం, పేజావరు మఠం, కఠిపురుమఠం, కృష్ణాపూర్ మఠం, పలియారు మఠం, శిదువురు మఠాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఉడిపి శ్రీకృష్ణ ఆలయంలో రోజూ ప్రాతఃకాలంలో స్వామివారికి చేసే పూజలు నయనానందకరంగా సాగుతాయి. అలాగే స్వామివారికి ఏటా చేసే శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు".
సశేషం...
సర్వం శ్రీసుబ్రహ్మణ్యార్పణమస్తు.

Sri Krishna Temple in Udupi :- 0820-2520598 

http://www.udipikrishnamutt.com/ 

మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి
Share on Google Plus

About Raja Chandra

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.

4 comments:

Lord Shiva Temples

Have You Visited These Temples

Contact:

కోత్తగా వెబ్సైటు స్టార్ట్ చేశాను .. చూసి మీ సలహాలను ఇవ్వగలరు . www.hindutemplesguide.com

Sponsor

Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu