Sringeri Temple Information

శృంగేరి   | Sringeri ( Sharada Peetham ) Temple Information

శ్రీ మోహన్ గార్కి కృతజ్ఞతలు తెలియచేస్తూ .. ఆయన రాసిన పోస్ట్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను ..


కొల్లూరు మూకాంబికా అమ్మవారి ఆలయం దర్శించిన తర్వాత, అదే రోజు బయలుదేరి మేము శృంగేరి చేరుకున్నాము.


మేము కొల్లూరు నుండి శృంగేరి వేళ్ళడానికి బయలుదేరేసరికి కొల్లూరులోనే సాయంత్రం 5.30 దాటిపోయింది. ఇక అప్పుడు బయలుదేరి, ఘాట్ రోడ్ మీదుగా శృంగేరీ ప్రయాణం పరమాద్భుతం. ఆ వెళ్ళే దారిలోనే, దేశంలో రెండవ అతి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే "అగుంబే" మీదుగా వెళ్ళాము, ఆ అగుంబేలోనే, సూర్యాస్తమయం తప్పనిసరిగా చూడవలసినది అని చెప్పారు. కానీ సాయంత్రం ఆలస్యంగా బయలుదేరడం వలన, అగుంబే చేరేసరికే రాత్రి ఏడున్నర అయ్యింది, అంత రాత్రి వేళలో, ఆ 'sunset pint' దగ్గర ఆగినా, చీకటిపడిపోవడం వలన ఏమీ పెద్ద కనబడలేదు. ఇక మేము శృంగేరీ చేరే పర్యంతమూ, చక్కగా 'జయ జయ శంకర - హర హర శంకర' అని నామం చేసుకుంటూ రాత్రి తొమ్మిది అయ్యేసరికి శృంగేరి చేరుకున్నాము, వెడుతూనే అక్కడ శృంగేరీ పీఠం యొక్క ముఖ ద్వారం ఎదురుగా ఉన్న భారతీతీర్థ కృప అనే వసతి గృహంలో మాకు రూమ్ దొరికింది. మేము ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని మరునాడు ఉదయమే వసతి గృహములో సంధ్యావందనం చేసుకుని, శారదాంబ ఆలయానికి బయలుదేరాము.
Inline image 5

ఆలయం లోపలికి అడుగుపెడుతూనే అక్కడి ప్రశాంత వాతావరణము చాలా చాలా ఆహ్లాదంగా అనిపించింది. ఈ భూమి మీదే కదా ఆదిశంకరుల నుండి ప్రారంభించి, ఎంతో మంది జగద్గురువులు పాదధూళి కలిగిన ప్రదేశం, ఈ క్షేత్రం గురించే కదా మన పూజ్య గురువు గారు ఎన్నో మార్లు ప్రవచనములలో చెబుతూ ఉంటే .........ఎప్పుడెప్పుడు మనము కూడా వెళ్ళి ఆ శృంగేరీ క్షేత్రం దర్శిస్తామా........ అని కలవరించేవాళ్ళము అని తలచుకుంటూ లోపలికి వెళ్ళాము.

ప్రస్తుతం ఆలయం వెలుపల ఒక రాజగోపుర నిర్మాణం జరుగుతోంది. అందుచేత, ఆలయంలోకి ప్రవేశం ఆ రాజగోపురంలోంచి కాకుండా, ఆ గోపురానికి కుడివైపున మరో ద్వారం ఉన్నది. అందులోంచి లోపలికి ప్రవేసిస్తాము. లోపలికి వెళ్లగానే మొదట ఎడమవైపుకి తిరిగగానే, అక్కడ శృంగేరీ పీఠ కార్యనిర్వహణాధికారి వారి ఆఫీసు ఉంటుంది, దాని ఎదురుగా ఒక పెద్ద బోర్డ్ మీద, శృంగేరీలో ఎక్కడెక్కడ ఏ ఏ మందిరాలు ఉన్నాయో రూట్ మ్యాప్ చూపిస్తూ ఉంటుంది. ఆ బోర్డ్ దాటి కాస్త నడిచి కుడివైపు తిరిగితే ఇక అక్కడ ఉన్న ఆలయాలు దర్శనం అవుతాయి. మొదట ఆ లోపలికి వెళ్ళగానే ఎడమ వైపు చంద్రశేఖర భారతీ సభామంటపము ఉంటుంది. (ఈ మంటపములోనే, జగద్గురువులు విజయ యాత్ర ముగించి శృంగేరీ చేరిన వెంటనే అనుగ్రహ భాషణం చేశారు..), ఆ మంటపము ప్రక్కగా యాగశాల ఉంటుంది. కుడిచేతి వైపు చూడగానే, మొదట అక్కడ సేవా కౌంటర్లు, ప్రసాదం ఇచ్చే కౌంటర్లు కనబడతాయి. ఆ రెండు కౌంటర్ల మధ్య నుంచి ఒక హాలులోకి వెళ్ళే ప్రవేశ ద్వారం కనబడుతుంది. ఆ హాలు పేరు నాకు గుర్తు లేదు కానీ, ఆ హాలులోకి వెడితే, ఆ లోపల గోడల మీద ఆదిశంకరుల జీవిత చరిత్రని చెప్పే అద్భుతమైన చిత్తరువులు కనబడతాయి. ఇంకా ఇదే హాలు లోంచి లోపలికి వెళ్ళి, ఆ హాలుకి వెనుకవైపు ఉన్న ద్వారంలోంచి బయటికి వెడితే అక్కడ, ఆదిశంకరుల ఆలయము కనబడుతుంది. ఈ ఆదిశంకరుల మూర్తిని ప్రతిష్టించినవారు 33వ పీఠాధిపతి అయిన శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు. ఈ ఆలయంలో ఆదిశంకరులు యోగాసనంలో కూర్చుని, కుడిచేతిలో చిన్ముద్ర, ఎడమ చేతిలో అభయ ముద్ర చూపిస్తూ ఉంటారు. శంకరుల పాదపీఠం మీద నలుగురు శిష్యుల మూర్తులు దర్శనమిస్తాయి. శంకరుల ఎదురుగా ఒక చిన్న శివ లింగము కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ శంకరుల ఆలయంలో చిన్న ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. మెట్లెక్కే దారిలో ఏనుగులు, ఆలయం ఎదురుగా పరమశివుని మూర్తి రూపం చెక్కబడుతున్నాయి. ఈ ఆలయం పూర్వంలో ఉన్న ఫోటో శృంగేరీ పీఠం వారి సైట్లోంచి క్రింద చూడగలరు.
Inline image 6

ఆ ఆలయంలోనే వాయువ్య దిక్కులో తోరణ గణపతి కూడా దర్శనమిస్తారు. ఈ తోరణ గణపతి గురించిన వృత్తాంతము శృంగేరి పీఠం వారి సైట్ నుంచి సంగ్రహించినది.. తెలుగులో తర్జుమా చేసి ఇక్కడ ఇస్తున్నాను..
తోరణగణపతిః
Inline image 7

శృంగేరీలో 33వ పీఠాధిపతి అయిన శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వామి వారి సమయం నుంచి జగద్గురువుల నివాస స్థలములు, తుంగానదికి దక్షిణ దిక్కున ఉన్న నరసింహవనంలోకి మార్చబడ్డాయి. అంతకు పూర్వం ఆచార్యులంతా, శారదా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న శంకరుల సన్నిధికి దగ్గరగా ఉండేవారు. 32వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వృద్ధనృసింహ భారతీ స్వామి వారు జగద్గురువులుగా ఉన్నప్పుడు,
ఒకానొక సమయంలో మఠమునకు సంబంధించిన ఒక సమస్యని పరిష్కరించే ఆలోచనలో ఉన్నప్పుడు, వారికి గణపతి ధ్యానంలో సాక్షాత్కరిమ్చారు. ఆయన వెంటనే, దగ్గరలో ఉన్న ద్వారంలోని తోరణంలో ఉన్న గణపతికి దూర్వాంకురం వేసి పూజ చేశారు. అప్పటితో ఆ సమస్య తీరిపోయింది. అప్పటినుంచి ఆ తోరణము నందున్న గణపతిని తోరణపతి అని పిలిచేవారు.
Inline image 8

తర్వాత కాలంలో వృద్ధ నృసింహ భారతీ స్వామి వారి శిష్యులయిన శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు ప్రతీ రోజూ దూర్వాంకురముతో పూజ చేసేవారు. ఆ తర్వాత చంద్రశేఖర భారతీ స్వామి వారు వెండి కవచం చేయించారు, ఆ తర్వాత అభివన విద్యాతీర్థుల వారు తోరణగణపతి సన్నిధిలో నిత్య పూజ జరిగేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ స్వామి వారు స్వర్ణకవచం చేయించారు. మేము వెళ్ళినప్పుడు స్వామి వారికి నిత్య పూజ జరిగి హారతి ఇస్తున్నారు.

Inline image 9

మళ్ళీ వెనక్కి వస్తే, ఇందాక ఏ ప్రసాదం కౌంటర్ పక్కనే ఉన్న ద్వారంలోంచి హాలులోకి వెళ్ళామో, ఆ ద్వారం గుండా మళ్ళీ బయటకి వస్తే, కుడి చేతివైపు, శారదా అమ్మవారి ఆలయం కనబడుతుంది. ఈ ఆలయంలోనే, ఆదిశంకరులు ప్రతిష్టించిన పరాదేవత స్వరూపం, శారదా అమ్మవారి మూర్తి కనబడుతుంది. ఇప్పుడు ఉన్న శారదా అమ్మవారి మూర్తి స్వర్ణ మూర్తి, ఈ మూర్తిని పూర్వ ఆచార్యులైన, శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వామి వారు ప్రతిష్టించారు అని చెప్పారు. అంతకు పూర్వం ఉన్న చందన శారదా అమ్మవారి మూర్తిని, విద్యాశంకర ఆలయంలో గర్భగుడికి బయట ఎడమచేతి వైపు చూడవచ్చు.
Inline image 1Inline image 2


శారదా ఆలయంలో ప్రవేశించగానే, దూరం నుంచే అమ్మవారు దర్శనమిస్తూ కనబడతారు. ఒక్కసారి ఒళ్ళు పులకిస్తుంది. శ్రీశారదా నమోస్తుతే. శ్రీశారదా నమోస్తుతే! అని విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్త పుటీ, కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచి విభాసి వైరించి అని మూకపంచశతిలో శ్లోకం చదువుకుని, అమ్మకి నమస్కరించి, లోపలి ప్రాంగణంలో ప్రదక్షిణం చేయడం మొదలు పెట్టాము. ప్రదక్షిణ చేసేటప్పుడు, మొదట ఎడమవైపు, జగద్గురువులు కూర్చునే పెద్ద సింహాసనం, ఆ పక్కనే జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి మూర్తి ఉంటుంది, ఇంకా కొంచెం ఎదరకి వెళ్తే, ఎడమవైపే, అక్షరాభ్యాస మంటపము అని కన్నడంలో వ్రాసి ఉంటుంది. ఈశ్వరుడు అనుగ్రహిస్తే, మా బుజ్జితల్లి చి.లలితా షణ్ముఖప్రియ శ్రీవల్లి కి మూడవఏడు రాగానే ఇక్కడ అమ్మ సమక్షంలో అక్షరాభ్యాసం జరిగితే బాగుండు అని కోరిక అనాలో/ లేక సంకల్పం అనాలో తెలియదు... కానీ బలంగా అమ్మ తప్పకుండా ఆ కోరిక తీరుస్తుంది అనిపించింది. అలాగే ఇంకా ఎదరకి ప్రదక్షిణం చేస్తూ వెడితే, ఎడమచేతివైపు చివరకి వెడితే, నైరుతి దిక్కులో శక్తి గణపతి దర్శనమిస్తారు.
Inline image 3

 ఇంకా ప్రదక్షిణంగా వెడితే, అమ్మవారి ఆలయానికి వెనుక భాగంలో చాలా పెద్ద మేరువు, నా పొడవు కన్నా ఎత్తైనదేమో అని చెప్పాలి, అంత పెద్ద మేరువు ఉంటుంది. నా జీవితంలో అంత పెద్ద మేరువు ఎక్కడా చూడలేదు. ఇంకా ముందుకి వెళ్తే, అక్కడ చాలా పెద్ద ఉత్సవ మూర్తులు, అమ్మవారు, అయ్యవారు, గణపతి మొదలైన మూర్తి దర్శనం అవుతుంది. అలా ప్రదక్షిణం చేసి, శారదా అమ్మవారిని కాస్త దగ్గరగా దర్శించుకుని, బయటకి వచ్చాము. శారదా అమ్మవారికి విశేషమైన అలంకారం ఉండడం వల్ల, ఎక్కువగా అమ్మ పాదాలు కానీ, ఎలా కూర్చున్నదీ మొదలైన వివరాలు మాకు అర్ధం కాలేదు. అమ్మ మాత్రం స్వర్ణమయమై, ఆ గర్భ గోడల దగ్గర నుంచి స్వర్ణమయమై ఉందేమే, మా అమ్మ శారద మెరిసిపోతూ, చిరునవ్వులొలికిస్తూ,.."ఏమిరా మోహనా!!! నా జ్ఞానపుత్రుని వాక్కులు క్రమం తప్పకుండా వింటున్నావా?? వారు చెప్పిన వాక్కులను ఆచరణ యందు పెడుతున్నావా?? నువ్వు నా జ్ఞానపుత్రుడి పాదాలు పెట్టుకోరా నాన్నా, చాలు ....... నీ జీవితం ధర్మబద్ధమై, నీకు గురుకటాక్షం లభిస్తుంది." అన్ని అమ్మ పలకరించి ఆశీర్వదించింది. నువ్వు నా జ్ఞానపుత్రుని వాక్కులను వింటూ, వారికి ప్రతీ రోజూ నమస్కరిస్తూ, వారు చెప్పిన వాక్కులను ఆచరణ యందు అనుష్టిస్తూ ఉన్నావా... నీకు నా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందిరా నాన్నా అని అభయం ఇచ్చినది.
Inline image 10
అలా అమ్మవారి దర్శనం చేసుకుని బయటకి వచ్చాక, శారదా అమ్మవారి ఆలయంలోంచి బయటకు వస్తూ ఉంటే ఎడమవైపు (శారదా ఆలయంలోపలకి వెళ్ళేటప్పుడు, మనకి కుడివైపు) చిన్న కోదండరామాలయం ఉంటుంది, స్వామి లక్ష్మణ, సీతా సమేతుడై కోదండం పట్టుకుని దర్శనమిస్తారు.

Inline image 11

అదే విధంగా శారదా అమ్మవారి ఆలయంలోంచి బయటకి వస్తూ ఉంటే కుడివైపు (శారదా ఆలయంలోపలకి వెళ్ళేటప్పుడు, మనకి ఎడమ వైపు)గా మలయాళ బ్రహ్మ ఆలయం దర్శనమిస్తుంది. కర్ణాటకలో క్షేత్రపాలకుడిని మళయాళబ్రహ్మ అని వ్యవహరిస్తారు. ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ మళయాళ బ్రహ్మ పూర్వం ఒక బ్రాహ్మణుడు, ఆయన అన్ని వేదాలు, శాస్త్రాలు చదువుకుని కూడా ఎవరికీ చెప్పేవారు కాదుట. అందుకని ఆయన శాపవశాత్తు, బ్రహ్మరాక్షసుడిగా పుడతాడు. ఒకనాడు విద్యారణ్యుల స్వామి వారి విజయయాత్రలో వెళిపోతూ ఉండగా ఈ బ్రహ్మరాక్షసుడు స్వామి వారి పాదములమీద పడి, తనకి విముక్తి కలిగించమని ప్రార్ధిస్తాడు. అప్పుడు విద్యారణ్యుల వారు అతనిని అనుగ్రహించి, శృంగేరీలో క్షేత్రపాలకుడిగా ఉందమని అభయమిస్తారు. ఈ స్వామి వారికి ఇప్పటికీ దద్దోజనం నివేదన చేసి, నరదృష్టి, దృష్టిదోషాలు పోవాలని ఇక్కడ పూజలు చేస్తారు.


Contact
Postal correspondence

The Administrator,
Sringeri Mutt and its Properties,
Sringeri, Chickmagalur District,
Karnataka
PIN - 577139.
Phone Numbers
 +91-8265-250123
 +91-8265-250594
 +91-8265-250192


http://www.sringeri.net/

Comments

Post a Comment